ORKUT

Thursday, September 10, 2009

A అంటే AIEEE, B అంటే BITSAT, .... I అంటే IIT - ఆంధ్రాలో టెక్నోస్కూల్ వ్యాపారాలు



ఒక ఇంట్లో బాధ్యత గల తల్లిదండ్రుల మధ్య సంభాషణ:


తల్లి: ఎవండీ ! పక్కింటివాళ్ళ అమ్మయిని IIT coaching లో పెట్టారట.. వింటున్నారా?..
తండ్రి: మనవాడ్ని కూడా join చేద్దాం.. ఈ సంవత్సరం 5th class అవ్వనివ్వు.. పెట్టేద్దాం..
తల్లి: ఊర్కోండీ.. ఇవాళా రేపు అంతా IIT లు EAMCET లని LKG నుంచే పెట్టెస్తుంటే..
తండ్రి: నిజమేలే.. కానీ..వాడికి పాపం ఈ school తోనే సరిపొతోంది కదా.. ఆ tuition అని, ఈ tuition అని తిప్పుతూనే ఉన్నాం.. ఇప్పుడే ఎందుకనీ..
తల్లి: ఏదైనా ఈ competitionలో ఇప్పటి నుంచీ కష్టపడనిదే రాదండీ.. రేపు వాడికి IITలో rank వచ్చాక వాడే కదా సంతోషంగా ఉండేది.. నా మాట విని వాడు ఈరోజు పడే కష్టం కన్నా.. రేపటి భవిష్యత్తు గురించి అలోచించండి.. ఏమంటారు?
తండ్రి: వాడి భవిష్యత్తు కన్నా ఏది ముఖ్యం చెప్పు మనకి..? అలాగే చేసేద్దాం..కానీ వాడు
....
...
..
.


(ఇంతలో door bell మోగింది)


"తలుపు తెరవగానే..3 కేజీల మూటని మోసీ మోయలేక ముభావంగా చూస్తున్న మున్నాగాడు.. చదివేది 5th class అయినా రోజుకి పన్నెండు గంటలు schoolల్లో, tuition నుంచి ఇంటికొచ్చాక వాడు చేసేది ఒక్కటే.. పుస్తకాలతో కుస్తీ.. అందుకే కాబోలు వాడు వాళ్ళ class topper.."


వచ్చీ రాగానే..


తండ్రి: ఏరా.. ఇవాళ maths exam ఎలా రాశావ్?
మున్న: అంతా బానే రాశాను కానీ.. last question లో 3*3=6 అని తప్పు రాశా నాన్నా..
తల్లి: (కోపంగా)ఎన్ని సార్లు చెప్పాను నీకు.. మళ్ళీ అదే తప్పు చేసుకొచ్చావ్.. ఇలా అయితే నువ్వు వంద కి వంద ఎప్పుడు తెచ్చుకుంటావ్..నీ బొంద!
మున్న: అదీ.. చూస్కోలేదమ్మా.. ఈ సారి exam బాగా చేస్తాను..
తల్లి: ప్రతి సారీ ఇంతే చెప్తావ్! ఇలాగే 10th class కూడా అయిపోతుంది.. తర్వాత నువ్వు ఇంటర్ ఎలా చేస్తావో.. IIT లో seat ఎలా తెస్తావో ఎమిటో..
మున్న: (school bag దించుతూ అమాయకంగా) అమ్మా, ఆ IAT లో కూడా HomeWorkలుంటాయా?...
తల్లి: అది అప్పటి సంగతిగానీ ముందు ఈరోజు HW చేసి తగలడు.. అన్ని తప్పులు తప్పులు చేసుకొచ్చావ్.. రేపటి exam లో సరిగా చెయ్యకపోతే చూడు.. త్వరగా స్నానం చేసిరా పో !
....
...
..
.


తల్లి: అవునండీ.. IIT అంటే ఏమిటింతకీ.. మీకా full-form ఏమైనా తెలుసా?
తండ్రి: అవన్నీ మనకెందుకు.. మనకి మనవాడి భవిష్యత్తు ముఖ్యం.. వాడికందులో seat రావడం ముఖ్యం.. అంతేనా?
తల్లి: అంతే.. అంతే.. IIT లోనే మన మున్నాగాడి భవిష్యత్తు.. :)
తండ్రి: సరేగానీ.. ఇందాకా కొత్త school పేరేంటన్నావ్?
తల్లి: ఏం school అండీ?
తండ్రి: అదే.. రొజుకి పదిహేను గంటలు చదివిస్తారన్నావు చూడు.. పారా..something
తల్లి: అదా.. పారాయణ techno school..
తండ్రి: ఆ.. అందులో పెట్టేద్దాం.. ఎమంటావ్?
తల్లి: దానికన్నా శ్రీ హిరణ్య techno school అని ఉందిగా..అది top అటండీ.. అక్కడైతే ఇరవై గంటలు చదివిస్తారట..
తండ్రి: అయితే ఇంకేం.. అక్కడే పెడదాం.. అక్కడైతేనే rank కి guarantee ఎక్కువ ఉంటుందోయ్..
తల్లి: అది నిజం.. అందులోనే join చేద్దాం....ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా.. రేపట్నుంచి ఆ పక్కింటావిడకి గర్వంగా చెప్పుకుంటాను.. మన మున్నా కూడా IIT చేస్తున్నడని..
....
...
..
.


ఇప్పుడు మున్నా లాంటి ఎంతో మంది పిల్లలకి తెలిసిన దారులు రెండే రెండు.. ఒకటి IIT(ఇంజనీరింగ్) రెండోది మెడిసిన్.. పోనీ వాళ్ళంతా ఇష్టపడే అవన్నీ చేస్తున్నారా అంటే..అది ఇప్పటి పరిస్థితుల ప్రభావమనే చెప్పాలి.. మున్నా వాళ్ళ తల్లిదండ్రులకి పాపం వాడి మీద ఉన్నది ప్రేమే..కానీ వాడి భవిష్యత్తుపై పెట్టిన ఆలోచన వాడి బాల్యన్ని ఎలా ప్రభావితం చేస్తున్నయో అలోచించట్లేదు..అహర్నిశలు కష్టపడుతున్నారు..కష్టపెడుతున్నారు..ఇంతా చేస్తే రేపు ఆ rank రావాలిగా..schoolల్లో markలు తగ్గితే ఇంక ఎవరితో మాట్లాడకపోవడం,rank రాకపోతే ఘోర పాపం చేసిన వారిలా జనసంచారానికి దూరమైపోవడం.. ఇంకా మాట్లాడితే ఆత్మహత్యలంటారు.. ఎందుకిలా?? సరే ఈలోపు మీరు ఆలోచించండి..
మనం మున్నాగాడి గురించి చూద్దాం..


ఇలా కాలచక్రం పాతిక వసంతాలు పూర్తిచేసే సమయానికి మున్నా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్కుంటే వాడికి ఆ rank కన్నా కోల్పోయిన బాల్యమే గుర్తొస్తుంది.. ఆ వయస్సులో ఉద్యోగానికి.. ఉద్యోగమొచ్చాక జీతానికీ ఎలాగూ కష్టపడుతూ ఉండాలి.. అప్పుడు TVలో Tom n Jerry చూసే time ఉంటుందా.. లేకపోతే రోడ్ల మీద cricket అడుకునే వీలుంటుందా.. ఎప్పుడో weekends అప్పుడు office work లేకపోతే collegues తో సినిమా కెళ్ళడం... ఇంటికి fone చేసి మాట్లాడ్డం.. అలా జీతమే జీవితంగా గడిపేయడం..


నేనేదో ఈ education system ని మొత్తం తప్పు పట్టేసి పిల్లల్నందరినీ ఉద్ధరించేద్దామనే ఉద్దేశంతో లేనిక్కడ.. అవునండీ.. ఇప్పుడు మంచి ఉద్యోగాలు సులభంగా రావాలంటే ఇంజినీరింగే చదవాలి.. చదివించండి..కానీ ఆ పసికందుల ఆసక్తులనీ, అభిప్రాయాలని కూడా గౌరవించండి..రోజుకు పన్నెండు గంటల school చదువులను స్వస్తి చెప్పండి..వాళ్ళకి చదువనేది ఉద్యోగంతో పాటు ఙ్ఞానాన్ని కూడా ఇస్తుందని తెలపండి.. అఆఇఈ లతో పాటు సరిగమలని కూడా నేర్పండి..అలా పెరిగి సంపూర్ణ భావి భారత పౌరులైన తర్వాత వారి తల్లిదండ్రులుగా అప్పుడు మీరు తప్పకుండా గర్వించదగ్గ స్థానాల్లో ఉంటారు..


ఇది నా అభిప్రాయమే కాదు.. విన్నపం కూడా..!

Wednesday, September 9, 2009

నిరీక్షణ - (కపిత)


నిదురించే నయనాలకు కనిపించే కలవు నీవు
పడిలేచే కెరటాలలొ దరిచేరే అలవు నీవు
వినిపించే సరిగమలను శృతిచేసే గళము నీవు
మదికోరే అనురాగము అందించే ప్రేమ నీవు


పురివిప్పే నెమలిని కవ్వించే వానవు నీవు
లయతప్పే ఎదసడిని సంధించిన బాణము నీవు
చలిగుప్పే మాసానికి వెచ్చని కౌగిలి నీవు
అనిచెప్పే మనసుకి నచ్చిన చెలిమి నీవు 


వెలుగిచ్చే వెలుతురును వెలిగించే కాంతివి నీవా
ఎదురొచ్చే అలజడికి బదులిచ్చే అనుభవానివా
విరబూసే విరులన్నిట మూగముద్ద బంతివి నీవా
వెంటాడే ఎడబాటును ఇకనైనా తరిగించలేవా ..


నీలి గగనాన ఎగిరే విహంగానివో
నీటి సంద్రాన ఎగసే తరంగానివో
ఏటి తామరల చందాన విరిసే
మేటి అందాల భరిణవు నీవో


Tuesday, September 8, 2009

తెలుగు సీరియళ్ళు చూపించకుండానే చంపడం ఎలా?

ఒక ఇంట్లో: (అప్పుడే DINNER TIME అయింది)
తల్లి పిల్లలతో: office నుంచి నాన్నగార్ని రాని.. అందరం కలిసి భోం చేసేద్దాం.

(DOOR BELL..నాన్న వచ్చారు) కొద్దిసేపు తర్వాత..


నాన్నగారు: ఇవాళ news ఎంటో.. ఆ serials ఆపి కొంచెం news channel పెట్టు..
"సరిగ్గా అప్పుడు మనకు దొరికే ఏకైక programme కుట్రలు, కుతంత్రాలతో కూడిన చావు కబుర్లు!"


నూతన ప్రసాద్గారు(నేపధ్యవ్యాఖ్యానంలో):
"ఆ రోజు శ్రావణీ-సుబ్రహ్మణ్యం ల పెళ్ళి రోజు.. భర్త factory నుంచి త్వరగా వస్తారని శ్రావణి కళ్ళలో వత్తులేసుకుని లక్షవత్తుల నోము చేస్తోంది..


(అలా చాలసేపయిందని చెప్పడానికి .. గడియారం speedగా తిప్పి fast music..డగ్-డగ్..డగ్-డగ్..డగ్-డగ్)


అక్కడి గోడ మీది గడియారం లాగే సుబ్బిగాడు కూడా ఎక్కడో తిరుగుతున్నాడన్న అనుమానం ఆమె మదిలో మెదిలింది.ఆ అనుమానం పెనుతుఫానుగా మారుతుందని అప్పటికి ఆమె ఓహించలేకపోయింది! అనుకున్నట్లే సుబ్బి కొంచెం late గా వచ్చాడు.
భార్యతో పాటు భోజనం చేద్దామని కూర్చుని..
సుబ్బి: "గుత్తొంకాయ కూర ఏదీ" అన్నాడు
భార్య:(కోపంతో) "నేను వండలేదూ" అంది ఆ మాటలు తూటాల్లా సుబ్బి గాడి గుండెల్ని తాకాయి..


ఒక్కసారిగా table మీది అవకాయ పచ్చడిలాగ అతని మొహం ఎర్రబడింది..హఠాత్తుగా ఉగ్రావేశుడై గరిట తీసుకుని భర్యని టప్పీ-ఠప్పీ-టప్పీ అని బాద సాగాడు.
plastic గరిట బదులు steel గరిటను పెట్టి తప్పు చేసానన్న బాధలో భార్య దుఖసాగరంలో మునిగిపోయింది.
అయినా సుబ్బిగాడు టప్పీ-ఠప్పీ-టప్పీ అని బాద సాగాడు.
ఆ సంఘర్షణలో శ్రావణి మృత్యువుని ముద్దాడింది."


చావుకేకతో break... (కొన ఊపిరితో ఉన్న ఒక శవం మీద programme పేరు).. ఇప్పుడు ప్రసార వాహికలన్నమాట!


ఇంట్లో పరిస్థితి: horror music వల్ల, వచ్చే తొక్కలో tension వల్ల ఎవరికీ ముద్ద దిగలేదు.
భయంతో పిల్లల కడుపునిండిపోతుంది. టీవీకి అతికించిన కళ్ళు కంచంలో పెట్టేసరికి అన్నం చల్లారిపోతుంది. ఆ చావు గురించి మళ్ళీ analysis కొంతసేపు.. dinner అయిపోంగానే పిల్లలకేమో zandu balm ఇచ్చి పడుకోబెట్టి, పెద్దవాళ్ళు BP tablets వేసుకుని మళ్ళీ prog continue చేస్తుంటారు.. అక్కడ పిలాలూ ప్రశాంతంగా పడుకుంటారా అంటే అదీ లేదు.. వీళ్ళు మాత్రం ఎవర్నో చంపడానికి coaching తీస్కుంటున్నట్లుగా ఆ prog miss కాకుండా చూస్తారు.
ఇక్కడ చంపడం సరదానా లేక అది ఎలా జరిగిందో తెలుసుకోవడం సరదానా నాకు అర్ధంకాదు.. !!

Monday, September 7, 2009

తెలుగు TV channels లో reality shows

తెలుగు టీవి చానెళ్ళలో reality shows
:(తూటా - 3)

ఓంకార్: చ్చాలా బాగ్గా చ్చేసార్రు..అస్సల్కి మీ performance చూసి నాకు మాటలు రావడం లేదు..

participant 1: thaaankyou అన్నయ్యా.. (ఒక అరుపు)..
ఓంకార్:ఇప్పుడు మన judges ఏం అంటారో చూద్దాం..
judge 1: అంతా బానే ఉంది కాని చివర్లో పోయింది ! (STUN MUSIC)
p 1: :( .. (ఏడుపు మొహం)
judge 2: నువ్వు dance చేశావు .. but energy తో చెయ్యలేదు..
p 1: (ఏడుస్తూ) జ్వరం సార్ .. అయినా programme ఉందని వచ్చి చేసాను.. dance నా ప్రాణం సార్.. prize నాకే రావాలి.. (sentiment తో కొట్టావురా! .. SAD MUSIC)
p 2 from audience: (గుక్కపట్టి ఏడుస్తూ) నాకు prize రాకపోతే మా అమ్మ ఆత్మహత్య చేసుకుంటుంది సార్.. నాకే కావాలి.. (ZOOM.. STUNNING MUSIC)
p 3 from nowhere: (కోపంగా .. sensor cuts మధ్య వినిపించే మాటలు ..) నేను వచ్చినప్పుడే fix ఐపొయాను సార్.. prize రాకపోతె నేను చచ్చిపోతాను.. (JUDGES GET WORRIED.. SHOCK)

ఓంకార్: చ్చాల పోటీ మొదలైంది.. judges ఏం చ్చెప్తార్రో చూసే ముందు ఒక break..

break

breakలో మన ముచ్చట్లు: పిచ్చ గోల ! dance చూద్దామనుకుంటే ఇవికూడా మళ్ళీ ఏడుపు serials లానే ఉన్నయే.. ఈలోపు ఒక BP tablet వేసుకుందామ్..
ఇంట్లో ఒక గొంతు: ఇంతకీ SMSలు పంపించారా???
అదే పనిలో ఉన్నానే ! (మనసులో)ఇప్పటికి నా సగం నెల జీతం ఈ sms లకే తగలేశా :(
ఇంకొక voice: ఇంకా పంపించు నాన్న.. లేకపోతే చస్తాడట .. ఏమౌతుందో ఏమో.. tension


shooting మధ్యలో studio దగ్గర:
ఓంకార్: ఆ 'p 3' ఏంటయ్య సరిగ్గ ఏడవలేదు.. glycerine పోయలేదా!
p 3: sorry sir.. break తర్వాత బాగ try చేస్తాను ..
ఓంకార్: సరే సరే.. prize p 2 కీ.. మీరిద్దరూ వాడికివ్వగానే STUNNING AND SHOCKING MUSIC ఉంటుంది.. బాగా shock అవ్వండి..ఈసారి ఇంకొంచెం try చెయ్యండయ్యా !!..


OKAY..WELCOME TO తూట-3 AFTER THE BREAK
judges: ఇప్పుడు judgement మావల్ల కావడం లేదు..
ఓంకార్: మీరే ఇలా అంటే ఎలా master ? 


GAP.. (WORRIED FACES)


ఓంకార్: time ఐపోతోంది.. చెప్పండి (మరీ overact చెయ్యకు ...అని signal)
judges:(తలకాయ ఊపుతూ) hmm సరే..
TENSION DEVELOPING MUSIC CONTINUOUSLY FOR 3 MINUTES 

ఓంకార్: ఇప్పుడొక్క break తీస్కుంటేగ్గానీ tension ప్పోయేటట్లు లేద్దు.. తూటా-3 లో చిన్నా BREAK


ఇదండీ పరిస్థితి.. సరదాగా dance చేస్తారేమో అనుకుంటే ఏడిపిస్తుంటారు!! అదే వాళ్ళ జీవితాశయం అన్నట్లు.. అలా sms పంపించి అనవసరంగా feel అయిపోయే వాళ్ళకి నేను చెప్పేదొకటే.. LITE తీస్కోండెహే !!


గమనిక: ఈ టప ఎవరినీ ప్రత్యేకంగా ఉద్దేశించి రాసినది కాదు.. అలా అనిపించినా entertainment కోసం రాసినదని మర్చిపోగలరు :P

ఆంధ్రభోజుడు

రాజాధిరాజ..ఆంధ్రభోజ..కన్నడరాజ్య రమారమణ..మూరురాయరగండ..మల్లరాయర..విజయనగర సామ్రాజ్య ప్రభువులు శ్రీ శ్రీ శ్రీ కృష్ణదేవరాయలవారు వేంచేస్తున్నారహో . .!! సంగీత సాహిత్య లలితకళలను పోషించిన రాజ్యం పచ్చగా ఉంటుందని నిరూపించిన రాజు రాయలవారు.ఆయన సంగీత ప్రియుడు మరియు స్వతహాగా కవి కావడం వల్లనేమో కూడా వారి పాలనలో ద్రవిడ భాషల కవులందరికీ సన్మానాలు జరిగేవని చెప్పుకునేవారు.అష్టదిగ్గజ పోషకుడని మనకు తెలిసిందే.. వారే:
అల్లసాని పెద్దన

నంది తిమ్మన
మదయ్యగారి మల్లన్న
ధూర్జటి
అయ్యల రాజు రాన్మభద్రుడు
పింగళి సూరన్న
రామ రాజ్ భూషణుడు
తెనాలి రామ కృష్ణుడు

adithya 369 సినిమాలో చూపించినట్లు ఆ వజ్రం సంగతేంటో తెలీదు కానీ.. ఆయన వైష్ణవ మత పక్షపాతి కానీ అందులో శివభక్తునిగా చూపించారు :P .. 
ఆయన రాచకార్యాల గురించి చరిత్రలో ఎప్పుడో రాసారు..తెనాలి రామకృష్ణుని రూపంలో లెక్కలేనన్ని కథలు..ఇంక నన్నేం రాయమంటారు రాయల గురించి? :)

Sunday, September 6, 2009

తెలుగు చలనచిత్ర రారాజు - SVR

కంసుడు, రావణుడు, హిరణ్యకశిపుడు, నరకాసురుడు, ఘటోట్కచుడు.. వంటి పౌరాణిక పాత్రలు వినగానే ఠక్కున గుర్తుకొచ్చే స్వరూపం ఎస్వీ.రంగారావు గారిదే! ఎటువంటి పాత్రలోనైనా జీవించి ఆయా పాత్రలకు న్యాయం చేయడం ఆయన నైజం.సంస్కృత పద్యాలు సైతం అవలీలగా భావాన్ని వ్యక్తం చేస్తూ చదవగల కళ ఆయన సొంతం. మిస్సమ్మ లోని జమీందారు పాత్ర అయినా,బొబ్బిలి యుద్ధంలోని తాండ్ర పాపారయుడు పాత్ర అయినా ఆయన తప్ప వేరెవ్వరు పోషించినా అవి ప్రాణం పోసుకునేవి కావేమో!


ఆయన నటించిన సినిమాలన్నింటిలో నేను ఎప్పటికీ మరిచిపోలేనివి పాతాళ భైరవి మరియు మాయాబజార్. పాతాళ భైరవిలో మాంత్రికుడి వేషంలో, " సాహసం శాయరా.. ఢింభకా!" అంటూ సాగే ఆయన నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది.ఆరోజుల్లోనే ఆయన నర్తనశాలలోని కీచకుడి వేషానికి మొట్టమొదటి భారతీయునిగా అంతర్జాతీయ అవార్డు కూడా అందుకోవడం ఆంధ్రులందరికీ గర్వకారణం.నటుడిగా, దర్శకునిగా, నిర్మాతగా తెలుగు నాటక,సినీ రంగాలకి వారు చేసిన సేవ అద్వితీయం.ఇటువంటి గొప్ప కళాకారుల గురించి తెలుసుకోవడమే మన అదృష్టం.అలా ఎంత మాట్లాడినా తక్కువే!
హై హై నాయకా !! :)

సహజ కవి - పోతన

ముందుగా ఒక్కసారి మనం flashback లోకి వెళ్దాం. భక్తప్రహ్లాద సినిమా :).. ప్రహ్లాదుడితో SVR: ఆ హరి మన వైరి.. అతనిని మర్చిపో నాయన ! 
ప్రహ్లాదుడు: హరి నామము ఒకసారి రుచి చూచిన మరల విడువగలమా?
"మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు రాయంచ సనునె తరంగిణులకు
లలిత రసాలపల్లవ ఖాది యై చొక్కు కోయిల సేరునే కుటజములకు
బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు" అని వాణీ జయరాం గారు ఆలకించిన పద్యంలోని పరిమళాన్ని వర్ణించడానికి మాటలే కాదు.. భాషలు చాలవు.. !!


మా నాన్నగారు ఈ సినిమా పెట్టినప్పుడల్లా పోతనామాత్యుడు రచించిన ఆ భాగవత రచనలను ఆస్వాదించడానికి ఒక జన్మ చాలదనిపిస్తుంది.చిన్నప్పుడు schoolలో తెలుగు textbookలో ఆయన పద్యాలు చదవటం చాల గుర్తు.శ్రీ కృష్ణుడి బాల్య చేష్టలను వర్ణిస్తూ ఆయన చేసిన కల్పన ఒక అద్భుతం.సరళ భాషతో సహజకవిగా భాగవత భాండాగారాన్ని రచించిన పోతన భగవాన్ సంభూతుడనడానికి నిదర్శనం ఆయని మాటలతో:
"పలికెడిది భాగవతమట
పలికిన్చెడివాడు రామభద్రుండట
పలికిన భవహరమగునట
పలికెదవేరొండు గాథపలుకగనేల"


తెలుగు భాష బ్రతికుండే వరకూ ఇటువంటి మహాత్ములు ఎప్పటికీ మహనీయులే.. వారి రచనలు ఎప్పటికీ అపూర్వ కల్పనలే !


Saturday, September 5, 2009

నవ్వుల హరివిల్లు - జంధ్యాల

"నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం !"
హాస్యబ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు అన్న మాటలివి. తెలుగు సినీహాస్యానికి పెద్ద పీట వేసిన మహానుభావుడాయన. ఆయన మాటలు రాసిన లేదా దర్శకత్వం వహించిన దాదాపు నలభై పైచిలుకు సినిమాలన్నింటిలోనూ వారి సృజనాత్మకత ఉట్టిపడుతూంటుంది.హాస్యరస ప్రధానంగా వారు చేసిన సినీ'మాల'న్నీ ఆణిముత్యాల హారంలా తెలుగు కళామతల్లి మెడలో ఎప్పటికీ నిలిచిపోతాయి.

ఆయన పలికించిన కొన్ని నవ్వుల పువ్వులు: "నాకేంటి? అహ..నాకేంటి!", "i am పాండ్..james పాండ్", "నన్ను కవిని కానన్న వాడ్ని కత్తితో పొడుస్తా..", " హైదరాబాదు, సికిందరాబాదు, అలహాబాదు.. నా బొంద బాదు", "అంటే మీకు నా గురించి నిజంగా తెలీదా.. మా తాతలు ముగ్గురు..", "ప్పె ప్పె.. ఓహో అదా అలాగే చేసేద్దాం.. ప్పెళ్లికి time అయింది.. వినబళ్ళ", " "క్రీస్తుపూర్వం _వ శతాబ్దం అనగా __వ సంవత్సరం భాద్రపద శుద్ధచవితి.. __యుద్ధంలో వీరమరణం పొందిన రాజు ఎవరు బాబు? నీ యమ్మ మొగుడు బే (బూతు-బూతు-బూతు)", "మానవా.. మానవా.. నేను మానను", "ఎక్కడికో వెళ్లిపొయాను sir.. హిమాలయాల అంచుల దాక వెళ్లిపోయాను sir.. అక్కడ్నుంచి దూకై పీడ విరగడౌతుంది", "బ్రో-చే-వా-రెవరుర టకటక.. నినువిన టకటక రఘువరా.. దాసూ!!", ..


ఇలా ఎన్నో.. చెప్పుకుంటూపొతే మన పొట్ట నిజంగానే చెక్కలౌతుంది..హాస్యంతో పాటు భావప్రధానమైన సినిమాలైన సాగరసంగమం, శంకరాభరణం, బాబాయి హోటల్, ఆపద్బాంధవుడు వంటి మరికొన్ని సినీమాలకు మాటలు కూడా రాసారు.ఆయన తన సినిమాలతో 'నవ్వు నాలుగు విధాల చేటు' అన్న నానుడిని మార్చి 'నవ్వు నలభై విధాల great" అని నిరూపించి ఎన్నోసార్లు ఉత్తమ దర్శకుని బిరుదులు అందుకున్నరు.

Friday, September 4, 2009

తెలుగు నాట వేటూరి పాట

తెలుగు సినిమా పాటలకి ఊపిరిపోసిన వారిలో వేటూరి సుందరరామమూర్తి గారి సేవ వర్ణనాతీతం.కథకనుగుణంగా వారు చేసే పద ప్రయోగాలకు గాని సందర్భానుసారంగా సంధించే పదజాలానికి గాని ఎంతటి వారైనా మంత్రముగ్ధులౌతారు.
"భూదారిలో నీలాంబరి..మా సీమకే చీనాంబరి" అని గోదావరిని పడవళ్లు తొక్కించినా, "ఓంకార నాదాను సంధానమౌ గానమే" అని శంకరాభరణం అందించినా అది వేటూరి వారికే దక్కింది.
"రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే" , "నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఈ రెంటి నట్టనడుమ, నీకెందుకింత తపన", "ఎడమచేతన శివుని విల్లును ఎత్తినా ఆ రాముడే..ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో..", "ఆమనీ పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళా" అంటూ ఎన్నో భావప్రధాన సాహిత్యాలను అందించిన ఘనత వారిది.స్వచ్ఛమైన తెలుగు పాటలను మనకు అచ్చంగా అందించిన వేటూరి వారిది చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే స్థానం అనడంలో అతిశయోక్తి లేదు!

అవధానంలో హాస్యోక్తి

ఒకసారి ఒక అవధానంలో అసందర్భ ప్రసంగంలో ఒక పృచ్ఛకుడు అడిగాడట "ఆ దేవుడు కూడా మోయలేని రాయి ఏది?" అని.
అప్పుడా అవధాని హాస్యంగా ఇలా చెప్పారట.
"ఆ దేవుడు కూడా మోయలేని రాయినే సంసారం అంటారు నాయనా. ఆ దేవుళ్ళు కూడా ఈ సంసార సాగరాన్ని ఈదలేకపోయారు. ఆ విష్ణుమూర్తినే చూడండి. ఆయనకీ ఇద్దరు భార్యలు. ఒకరేమో లక్ష్మీ దేవి. సుచల.ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో తెలియదు. ఇంకొకరు భూదేవి.అచల. స్థిరంగా ఉంటుంది తప్ప ఎక్కడికీ కదలలేదు. ఇక ఆ శివుడి సంసారాన్నే తీసుకుంటే ఆయన వాహనం ఎద్దు, ఆయన బార్య వాహనమేమో సింహం. ఆ సింహం ఈ ఎద్దుని ఎప్పుడు తినేద్దామా అని చూస్తూ ఉంటుంది. ఆయన పెద్దకొడుకు వినాయకుడి వాహనమేమో ఎలుక. శివుడి మెడలో ఉన్న పాము ఈ ఎలకని తిందామని చూస్తుంటే ఆయన రెండో కొడుకు కుమారస్వామి వాహనమైన నెమలేమో ఆ పాము వంక చూస్తుంటుంది ఎప్పుడు తిందామా అని. ఇలా వాహనాల మధ్య గొడవలతో సతమతమయ్యే ఆయనకి సవతులైన గంగాగౌరిల కయ్యాలు ఉండనే ఉన్నాయి. అందుకే నాయనా ఆ దేవుడు కూడా మోయలేని రాయి సంసారం తప్ప మరొకటి కాదు" అని హాస్యంగా సమాధానం చెప్పారట

శ్రీశ్రీ ఒకసారి..

శ్రీశ్రీ గారి రచనలతో పాటు చతురత గురించి ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలుసుకోని ఆంధ్రులు లేరు. ఒకసారి ఆయన ఏదో సాహిత్య సమావేశానికి తమిళనాడు వెళ్లారట. అక్కడ మంచినీటిని తన్నీరని పిలుస్తారు.ఆయన భోజనం చేసిన హోటల్లో ముందుగా వేడి తన్నీరు ఇవ్వడం సాంప్రదాయం.భోజనానంతరం ఆయన మిత్రులతో సమావేశమైన శ్రీశ్రీ రద్దీగా ఉన్న ఆ హోటల్ని విమర్శిస్తూ వేడితే'నీరు' మాత్రం ఇచ్చారంటూ చెప్పారట.ఆయన చెసిన వ్యంగ్య ప్రయోగాన్ని గుర్తించిన వారందరూ ఫక్కుమని నవ్వారు.


కూడలి